హైదరాబాద్: ఈ సారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పక్కా వందకు పైగా డివిజన్లను గెలుచుకుంటామని టీఆర్‌ఎస్ కర్యానిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్‌లో ప్రచారంలో పాల్గొన్న మంత్రి.. పోయినసారి సెంచరీకి ఒక్క విజయం దూరంలో నిలిచిపోయామనీ.. ఈ సారి పక్కా వందకు పైగా డివిజన్లను గెలుచుకొని తీరుతామన్నారు కేటీఆర్. తమెలాగైనా గ్రేటర్‌లో మేయర్ పీఠం సాధిస్తామని బీరాలు పోతున్న బీజేపీ.. నగర వాసులు కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. కరోనా, వరదల సమయంలో వారు ఎక్కడున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. వరదల్లో నగరంలోని చాలా మంది తమ సర్వం కోల్పోయారనీ.. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు సాయం చేస్తే.. ఈసీకి లేఖ రాసి ఆపేశారు. వీళ్లా నగరాన్ని అభివృద్ధి చేసేది..? అని కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తమకు ఎవరూ పోటీ కారనీ.. బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి వచ్చినా టీఆర్‌ఎస్ ఘనవిజయాన్ని ఆపలేరని కేటీఆర్ సవాల్ చేశారు. తమకు ఏ పార్టీతోనూ పొత్తులేదని ఈ సందర్భంగా మంత్రి గర్తు చేశారు. వరద బాధితులకు రూ. 10 వేలిస్తే.. తాము గెలిచాక 25 వేలు ఇస్తామంటున్నారు బీజేపీ నాయకులు.. గెలుపుపై నమ్మకం లేకే ఇలాంటి సాధ్యం కాని హామీలిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.