-ప్రభుత్వ లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు
-పాడె మోసిన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ మాజీ హోం మంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి అంత్యక్రియలు కాసేపటి క్రితం ఫిలింనగర్‌లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. తమ అభిమాన నేత అంత్యక్రియలకు పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా లీడర్లు, కార్యకర్తలు తరలివచ్చారు. మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన పాడె మోసి, ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
రాత్రి 12.25 గంటలకు నాయిని తీవ్ర అనారోగ్యంగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ముందు కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆయన.. ఆ వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడ్డారు. వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ, ఆయన శరీరం అందుకు సహకరించకపోవడంతో మృత్యువాత పడ్డారు.
ఇవాళ మధ్యాహ్నం నాయిని అంతిమయాత్ర మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి మహాప్రస్థానం వరకు కొనసాగింది. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.