ప్రకాశం జిల్లా: సమస్యలపై ప్రశ్నించడానికి వెళ్లిన ఓ జనసేన కార్యకర్తపై వైసీపీ ఎమ్మెల్యే రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒళ్లు దగ్గర పెట్టుకో.. ఎమ్మెల్యేపై గౌరవం కూడా లేదా.. పొద్దున కూడా కారు దిగూ దిగూ అన్నావ్.. బలిసిందా నీకు.. అంత బలుపా? నన్నే ప్రశ్నిస్తావా రా! నా వద్దకు వస్తూ మెడలో ఆ కండువా ఏంటి? కండువా తీసెయ్ ముందు. ఆ తర్వాత మాట్లాడు’ అంటూ శివాలెత్తాడు. వివరాలు చూస్తే.. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. జనసేన కార్యకర్తపై ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. బేస్తవారపేట మండలం సింగన్నపల్లి వద్ద శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సింగన్నపల్లి గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వైసీపీ ఎమ్మెల్యే రాంబాబు రాగా.. జనసేన సీనియర్ కార్యకర్త దుమ్మని చంద్రశేఖర్, మరికొంత మందితో కలిసి వాహనానికి ఎదురెళ్లారు. ఇళ్ల స్థలాలతోపాటు.. మా ఊరు రోడ్డు సమస్య ఎందుకు పరిష్కరించలేదు? ఇతర సమస్యలన్నీ అలాగే ఉన్నాయి? అభివృద్ధి పనులు పట్టవా? అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే రాంబాబు కారులో నుంచే.. తీవ్ర ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. ముందు ఆ మెడలో కండువా తీసేయ్.. మెడలో ఒక పార్టీ కండువా వేసుకొని, నలుగురు తాగుబోతులను పక్కన పెట్టుకొని వచ్చి ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్పాలా’ అంటూ హెచ్చరిక ధోరణలో మాట్లాడారు. దీంతో వైసీపీ నేతలు జనసేన కార్యకర్తకు సర్దిచెప్పి పక్కకు తీసుకెళ్లారు.
ఈ అంశంపై జనసేన కార్యకర్తను వివరణ కోరగా.. తమ గ్రామ సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేయాలనుకున్నాం. కానీ, తను మాత్రం జనసేన కండువా చూసి ఓర్వలేకపోయాడు. ఇదెక్కడి న్యాయమండీ..? అంటే ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు తమ పరిధిలోని సమస్యలను ప్రజాప్రతినిధులకు తెలియజేయడానికి అర్హులు కారా.. అని ఆయన వాపోయారు. ఎవరెంత బెదిరించిన ఇక్కడ హడలిపోయేవారు లేరు. జనసేన పుట్టిందే ప్రశ్నించడానికి. మా నాయకుడు శ్రీ పవన్ కల్యాన్ గారి అడుగు జాడల్లో నడిచి, సమాజంలో పేరుకుపోయిన సమస్యలను వెలికితీసి, ప్రజలకు న్యాయం చేయడమే తమ విధి అని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.